Kakinada Parliamentary Constituency Profile
మన రాష్ట్రంలో కోస్తాతీరంలోని ప్రముఖ పార్లమెంటరీ
నియోజకవర్గాల్లో కాకినాడ ఒకటి. ఆ స్థానం 1952లో ఏర్పడింది. కాకినాడ పార్లమెంటరీ స్థానంలో
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
కాకినాడ లోక్‌సభ సీటులో చాలాకాలం కాంగ్రెస్ హవాయే
నడిచినా, మిగతా పార్టీలకు కూడా ఆదరణ బాగానే దక్కింది. 1952లో సిపిఐ తరఫున చెలికాని
రామారావు ఎంపీగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1980 వరకూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులే
గెలుస్తూ వచ్చారు. 1984లో తెలుగుదేశం గెలిచినా, మళ్ళీ 1989లో కాంగ్రెస్
పుంజుకుంది. 1991, 1996లో తెలుగుదేశం గెలిచింది. 1998లో భారతీయ జనతా పార్టీ తరఫున
ప్రముఖ నటుడు కృష్ణంరాజు గెలిచారు. అప్పుడు వాజ్‌పేయీ వేవ్ బలంగా ఉండడం, కృష్ణంరాజు
పట్ల జనాల్లో ఉన్న సానుకూల భావన బీజేపీని గెలిపించాయి. 1999లో తెలుగుదేశం తరఫున
ముద్రగడ పద్మనాభం గెలిచారు. మళ్ళీ 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎంఎం పళ్ళంరాజు
వరుసగా రెండుసార్లు గెలిచారు.
రాష్ట్ర విభజన ప్రభావంతో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన
2014లో తెలుగుదేశం నుంచి తోట నరసింహం విజయం సాధించారు. 2019లో జగన్ వేవ్‌లో
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి వంగా గీత గెలుపు దక్కించుకున్నారు.
ఇప్పుడు 2024లో వైఎస్ఆర్‌సిపి
తమ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్‌ను బరిలోకి దింపింది. ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన
తరఫున తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బరిలో నిలిచారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధిగా పాతకాపు పళ్ళంరాజు మళ్ళీ పోటీ చేస్తున్నారు.