Prattipadu Assembly Constituency Profile
ప్రత్తిపాడు నియోజకవర్గం 1951లో ఏర్పడింది. కాకినాడ
జిల్లాలో ఉన్న ఆ స్థానం పరిధిలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవి శంఖవరం, ప్రత్తిపాడు,
యేలేశ్వరం, రౌతులపూడి.
ప్రత్తిపాడులో మొదటి ఎన్నిక 1952లో జరిగింది.
అపుడు, ఆ తర్వాత 1955లోనూ కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించారు. 1962, 1967లో
ముద్రగడ వీరరాఘవరావు స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచారు. 1972లో కాంగ్రెస్ తరఫున వరుపుల
జోగిరాజు విజయం దక్కించుకున్నారు. ముద్రగడ వీరరాఘవరావు కుమారుడు ముద్రగడ పద్మనాభం 1978లో జనతాపార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.
తర్వాత తెలుగుదేశంలో చేరిన పద్మనాభం, 1983, 1985ల్లో టీడీపీ టికెట్ మీద, 1989లో
కాంగ్రెస్ అభ్యర్ధిగానూ గెలిచారు. 1994, 1999లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులే
గెలుపొందారు. 2004లో కాంగ్రెస్, 2009లో
టిడిపి విజయం సాధించాయి. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్సిపి అభ్యర్ధులను మార్చినా
రెండుసార్లూ గెలవగలిగింది.
2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్ధి వరపుల సుబ్బారావు
సమీప ప్రత్యర్థి తెలుగుదేశానికి చెందిన పర్వత శ్రీసత్యనారాయణమూర్తిపై గెలిచారు. 2019లో
వైఎస్ఆర్సిపి తరఫున పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ టిడిపి అభ్యర్ధి వరపుల రాజా మీద
గెలిచారు.
ఈసారి 2024లో అధికార
పక్షం తరఫున వరపుల సుబ్బారావు పోటీ చేస్తున్నారు. ఎన్డిఎ కూటమి తరఫున తెలుగుదేశం
అభ్యర్ధిగా వరపుల సత్యప్రభ బరిలోకి దిగుతున్నారు. ఆమె వరపుల రాజా సతీమణి. ఆయన
గతేడాది మార్చిలో కన్నుమూయడంతో సత్యప్రభకు టిడిపి పార్టీ బాధ్యతలు అప్పగించింది.
ఇప్పుడు ఆమెనే అభ్యర్ధిగా నిలబెట్టింది. ఇక ఇండీ కూటమి తరఫు నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా ఎన్వివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.