స్టాక్ మార్కెట్లు ఐదో రోజూ లాభాలను ఆర్జించాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల ఫలితాలతో ఇవాళ ఉదయం దేశీయ స్టాక్ సూచీలు నష్టాల్లో ప్రారంభమైనా, మధ్యాహ్నం తరవాత కోలుకున్నాయి. ఆర్థిక వృద్ధి రేటుపై మూడీస్ ఇచ్చిన రేటింగ్‌తో బ్యాంకింగ్ స్టాక్స్ పరుగులు పెట్టాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలార్జించాయి.
ఉదయం ప్రారంభంలో సెన్సెక్స్ నష్టాలతో 73572 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి, 74571 పాయింట్లను దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 486 పాయింట్లు పెరిగి 74339 వద్ద ముగిసింది. నిఫ్టీ 167 పాయింట్లు పెరిగి 22570 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ 83.32 వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, ఐటీసీ షేర్లు లాభాలను ఆర్జించాయి. టైటన్, హెచ్‌యూఎల్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి షేర్లు నష్టపోయాయి.కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు పది శాతం నష్టాలను చవిచూసింది. ముడిచమురు ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. బ్యారెల్ ముడిచమురు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.