సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ప్రతిపక్ష ఎంపీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరస్పర విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలపై ఏప్రిల్ 29 ఉదయం 11 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల ప్రచారం మొదలయ్యాక కీలక నేతలపై కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులు రావడంతో సీఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తరవాత ప్రధాన పార్టీల అధ్యక్షులకు నోటీసులు జారీ చేయడం ఇదే మొదటిసారి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం పార్టీల నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు. వారి ప్రసంగాలను అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత ఆయా పార్టీల అధ్యక్షులకు ఉంటుంది.
పార్టీ ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లు, కీలక వ్యక్తులు ఆచితూచి ప్రసంగించాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.