Anakapalli Parliamentary Constituency Profile
ఉత్తరాంధ్రలో బెల్లం పేరు చెబితే గుర్తొచ్చే పేరు
అనకాపల్లి. ఆ ఊరు లోక్‌సభా నియోజకవర్గంగా 1962లో ఏర్పడింది. అనకాపల్లి పార్లమెంటరీ
స్థానంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి చోడవరం, మాడుగుల, అనకాపల్లి,
పెందుర్తి, ఎలమంచిలి, పాయకరావుపేట (ఎస్సీ), నర్సీపట్నం.
అనకాపల్లి ఎంపీ స్థానంలో ఆది నుంచీ కాంగ్రెస్ ఆధిక్యం
బాగానే ఉంది. 1962 నుంచి 1980 వరకూ కాంగ్రెస్ విజయం సాధించింది. 1984లో ఒకసారి
తెలుగుదేశం గెలిచినా 1989, 1991లో కాంగ్రెస్ తరఫున కొణతాల రామకృష్ణ గెలుపు
దక్కించుకున్నారు. 1996లో టిడిపి, 1998లో కాంగ్రెస్ పంచుకున్నాయి. 1999, 2004లో
టిడిపి గెలవగా 2009లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంది.
2009లో అనకాపల్లి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ నుంచి
సబ్బం హరి, టిడిపి నుంచి ఎన్ సూర్యప్రకాశరావు పోటీ చేయగా, సబ్బం హరి విజయం సొంతం
చేసుకున్నారు. 2014లో, అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలో
తెలుగుదేశం తరఫున పోటీ చేసిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి
శ్రీనివాస్, వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి గుడివాడ అమరనాథ్‌ను ఓడించారు. 2019లో
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి భీశెట్టి వెంకట సత్యవతి తెలుగుదేశానికి చెందిన ఎ
ఆనందబాబుపై ఘనవిజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అనకాపల్లి పార్లమెంటరీ స్థానం
నుంచి వైఎస్‌ఆర్‌సిపి బూడి ముత్యాలనాయుడును రంగంలోకి దింపింది. ఎన్‌డిఎ కూటమి నుంచి
బిజెపి అభ్యర్ధిగా సిఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్
అభ్యర్ధిగా వేగి వెంకటేష్ పోటీ పడుతున్నారు.