ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న
పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా
సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే
అధికారం తమకు లేదన్న సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం పనితీరును తాము నిర్దేశించలేమని తెలిపింది.
ఎన్నికల
ఫలితాల లెక్కింపు సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లను క్రాస్ చెక్
చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వు చేసింది. ఈ
అంశంలో ఇంకా తమకు సందేహాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని ప్రశ్నలు
సంధించింది.
ఈవీఎంలో
మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించిన న్యాయస్థానం, అది ఒకసారి
రూపొందించిన ప్రోగ్రామా, కాదా? అన్నది నిర్ధారించాలని సూచించింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ
మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.
ఎన్నికల
సంఘం వివరణను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కేవలం అనుమానాలను
ఆధారం చేసుకుని ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది. ఎన్నికల సంఘం ఓ
రాజ్యాంగ సంస్థ కనుక దాని పనితీరును తాము నిర్దేశించలేమని స్పష్టం చేసింది.
పారదర్శకత
కోసం ఈవీఎం సోర్స్ కోడ్ ను న్ని బయటపెట్టాలని పిటిషనర్లు కోరగా ధర్మాసనం
వ్యతిరేకించింది.
ప్రస్తుతం
ఓ అసెంబ్లీ స్థానంలో ఐదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో క్రాస్ చెక్
చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్
చేస్తున్నారు.