Anakapalli Assembly Constituency Profile
అనకాపల్లి బెల్లం పేరు వినని తెలుగువాడు ఉండడు. ఆ
ఊరి పేరుతో శాసనసభా నియోజకవర్గం 1951లో ఏర్పాటయింది. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో
రెండు మండలాలున్నాయి. అవి అనకాపల్లి, కశింకోట.
అనకాపల్లి నియోజకవర్గం కమ్యూనిస్టుల పాలనతో
మొదలైంది. 1952, 1962, 1967, 1978 ఎన్నికల్లో సిపిఐకి చెందిన కోడుగంటి గోవిందరావు
విజయం సాధించారు. 1955లో కృషికార్ లోక్‌పార్టీ, 1972లో కాంగ్రెస్ గెలిచాయి. 1983
నుంచి 1999 వరకూ అన్ని ఎన్నికల్లోనూ తెలుగుదేశమే గెలిచింది. 1985 నుంచి 2004వరకూ టిడిపి
తరఫున దాడి వీరభద్రరావే ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో కాంగ్రెస్ తరఫున కొణతాల
రామకృష్ణ గెలిచారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు విజయం
సాధించారు.
2014లో తెలుగుదేశం నుంచి పీలా గోవింద సత్యనారాయణ
వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి కొణతాల రఘునాథ్‌పై గెలిచారు. 2019లో వైఎస్ఆర్‌సిపి
అభ్యర్ధిని మార్చి, గుడివాడ అమరనాథ్‌ను బరిలోకి దింపింది. ఆయన టిడిపి అభ్యర్ధి పీలా
గోవింద సత్యనారాయణ మీద విజయం సాధించారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్‌సిపి తరఫున మలసాల భరత్‌కుమార్ పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున
జనసేన పార్టీ అభ్యర్ధిగా కొణతాల రామకృష్ణ బరిలోకి దిగుతున్నారు. ఇండీ కూటమి తరఫున
కాంగ్రెస్ అభ్యర్ధిగా ఇల్లా రామగంగాధరరావు నిలబడుతున్నారు.