వారసత్వ
పన్ను గురించి కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఛత్తీస్గఢ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు.
చనిపోయిన వ్యక్తుల ఆస్తుల్నీ కూడా కాంగ్రెస్ దోచుకుంటుందని దుయ్యబట్టారు.
మధ్య
తరగతి ప్రజలపై మరిన్ని పన్నులు విధించాలని కొంత కాలం కిందట యువరాజు, రాజ కుటుంబం సలహాదారు చెప్పారని
ఎద్దేవా చేశారు.
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని
కాంగ్రెస్ చెప్తోందన్న ప్రధాని మోదీ, తల్లిదండ్రులు
చెమటోడ్చి కూడబెట్టిన సంపద.. వారి వారసులకు లభించదన్నారు. వ్యక్తులు బతికి
ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి సొమ్మును దోచుకోవడం ఒక్కటే
కాంగ్రెస్ ఫార్ములా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. వారి
పూర్వీకుల ఆస్తి అని ఆ వ్యక్తులు భావిస్తున్నారంటూ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి
మాట్లాడారు. భారతీయులు మాత్రం తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడానికి కాంగ్రెస్
నేతలు ఇష్టపడట్లేదన్నారు.