Visakhapatnam Parliamentary Constituency Profile
‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అని పేరు గడించిన గొప్ప నగరం
విశాఖపట్నం. రాజకీయంగానూ విశాఖపట్నానికి అమితమైన ప్రాధాన్యత ఉంది. ఇక్కడ లోక్‌సభకు
ఎన్నికైనవారు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించినవారే.
విశాఖపట్నం లోక్‌సభా నియోజకవర్గం 1952లో
ఏర్పాటయింది. దీని పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో విజయనగరం జిల్లాలోని
శృంగవరపుకోట ఒకటి కాగా మిగతా ఆరూ విశాఖపట్నం జిల్లాలోనివే. అవి భీమిలి, విశాఖపట్నం
తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, గాజువాక స్థానాలు.
విశాఖపట్నం లోక్‌సభలో మొత్తంగా చూసుకుంటే
కాంగ్రెస్ ప్రాబల్యం అధికంగా కనిపిస్తుంది. 1952లో స్వతంత్ర అభ్యర్ధులు విజయం
సాధించగా 1957 నుంచి 1980 వరకూ వరుసగా కాంగ్రెస్ అభ్యర్ధులే గెలుపొందారు. 1984లో
తెలుగుదేశం పార్టీ తరఫున భాట్టం శ్రీరామమూర్తి గెలిచారు. 1989లో కాంగ్రెస్ 1991లో
టిడిపి వరుసగా గెలిచాయి. 1996, 1998లో గెలిచిన కాంగ్రెస్ 1999లో మళ్ళీ టిడిపికి దారిచ్చింది.
2004, 2009లో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. 2014లో బిజెపి అభ్యర్ధి కంభంపాటి హరిబాబు
వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి వైఎస్ విజయలక్ష్మి మీద విజయం సాధించారు. 2019లో వైఎస్‌ఆర్‌సిపి
తరఫున ఎంవివి సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మతుకుమిల్లి
శ్రీభరత్ మీద గెలుపొందారు.
ఇప్పుడు 2024లో ప్రతిపక్ష టిడిపి మళ్ళీ శ్రీభరత్‌నే
లోక్‌సభ అభ్యర్ధిగా నిలబెట్టింది. అధికార వైఎస్ఆర్‌సిపి మాత్రం అభ్యర్ధిని
మార్చింది. సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని నిలబెట్టింది.
ఇక్కడ ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి పులుసు సత్యనారాయణరెడ్డి బరిలోకి
దిగారు.