Gajuwaka Assembly Constituency
గత శాసనసభ ఎన్నికల్లో ప్రముఖ చలనచిత్ర నటుడు పవన్
కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన స్థానంగా, తెలుగు రాజకీయాల పట్ల కనీస అవగాహన
ఉన్నవారందరికీ, గాజువాక గుర్తుండి ఉంటుంది. 2019లో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర,
దక్షిణ నియోజకవర్గాలు నాలుగింటిలోనూ ఓటమిపాలైన వైఎస్ఆర్‌సిపికి విశాఖ లోక్‌సభ
పరిధిలోని మిగతా మూడు నియోజకవర్గాలూ ఊరట కలిగించాయి. వాటిలోనిదే గాజువాక కూడా.
గాజువాక నియోజకవర్గం 2008లోనే ఏర్పాటయింది. ఆ
నియోజకవర్గం పరిధిలో గాజువాక, పెదగంట్యాడ అనే రెండు మండలాలున్నాయి.
2009లో జరిగిన ఎన్నికల్లో గాజువాక నుంచి
ప్రజారాజ్యం పార్టీ గెలిచింది. ఆ పార్టీకి చెందిన చింతలపూడి వెంకట్రామయ్య,
స్వతంత్ర అభ్యర్ధి తిప్పాల నాగిరెడ్డి మీద విజయం సాధించారు. అయితే చిరంజీవి తన పార్టీని
విలీనం చేయడంతో వెంకట్రామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారారు. ఆ తర్వాత ఆయన
తెలుగుదేశంలోకి మారిపోయారు. అటు నాగిరెడ్డి వైఎస్ఆర్‌సిపిలో చేరారు.
2014లో తెలుగుదేశం తరఫున పోటీ చేసిన పల్లా
శ్రీనివాసరావు, వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధి తిప్పాల నాగిరెడ్డి మీద విజయం సాధించారు.
అయితే 2019లో కథ మారింది. వైఎస్ఆర్‌సిపి తమ అభ్యర్ధిని మాత్రం మార్చలేదు. జనసేన
తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ తెలుగు సినీనటుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసారు.
తెలుగుదేశం తరఫున పల్లా శ్రీనివాసరావు మరోసారి బరిలోకి దిగారు. చివరికి వైఎస్‌ఆర్‌సిపియే
గెలుపు సొంతం చేసుకుంది.
ఇప్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి
తమ అభ్యర్ధిని మార్చింది. గుడివాడ అమర్‌నాథ్‌ను గాజువాక నుంచి పోటీలోకి దింపింది. ఎన్‌డిఎ
కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావును మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చింది.
ఇండీ కూటమి తరఫున సిపిఎం మరడాన జగ్గునాయుడిని పోటీకి పెట్టింది. మరి అమర్నాథ్
సులువుగా గెలవగలరా, లేక పల్లా శ్రీనివాసరావు విజయం సాధిస్తారా అన్న ప్రశ్నకు జవాబు
కోసం వేచిచూడాల్సిందే.