Visakhapatnam North Assembly Constituency Profile
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం 2008లో ఏర్పడింది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ కొత్త అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేసారు. ఆ
తర్వాత మొదటి ఎన్నిక 2009లో జరిగింది.
ఈ నియోజకవర్గంలో విశాఖపట్నం అర్బన్ మండలంలోని
కొన్ని భాగాలు, విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌లోని 12 వార్డులు ఉన్నాయి.
తొలినాళ్ళలో కణతి నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1955,
1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. విశాఖ-2 నియోజకవర్గంగా ఏర్పడ్డాక
1967లో సిపిఎం నుంచి, 1972లో స్వతంత్ర అభ్యర్ధిగానూ పి సన్యాసిరావు గెలిచారు.
1978లో జనతాపార్టీ విజయం సాధించింది. 1983, 1985, 1994, 1999లో తెలుగుదేశం గెలిచింది. 1989లోనూ, ఆ
తర్వాత 2004లోనూ, 2009లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది.
2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వేవ్,
బిజెపి-తెలుగుదేశం పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పోటీ
చేసారు. ఆయన తన సమీప అభ్యర్ధి వైఎస్ఆర్‌సిపికి చెందిన చొక్కాకుల వెంకట్రావు మీద గెలిచారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గంటా
శ్రీనివాసరావు పోటీ చేసారు. వైఎస్ఆర్‌సిపికి చెందిన ప్రత్యర్థి కమ్ముల కన్నపరాజు
మీద గెలిచారు. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్‌సిపి అధికారంలోకి రావడంతో ఆయన
ప్రతిపక్షంలో సైతం స్తబ్ధంగా ఉండిపోయారు.
గంటా శ్రీనివాసరావు అధికార వైఎస్‌ఆర్‌సిపిలో చేరడానికి
ప్రయత్నించారు కానీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ ఆయన ప్రయత్నాలకు
గండికొట్టారనే ప్రచారం ఉంది. ఆరేడు నెలల క్రితం వరకూ గంటా టిడిపిలో క్రియాశీలంగా
లేకపోయినా, మొత్తం మీద టికెట్ సంపాదించుకున్నారు. అయితే, తాను కోరుకున్న భీమిలి
నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేస్తున్నారు. ఆ క్రమంలో విశాఖపట్నం ఉత్తరం
నియోజకవర్గాన్ని టిడిపి, తమ ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షమైన బిజెపికి ఇచ్చేసింది. ఆ
పార్టీ తరఫున విష్ణుకుమార్ రాజు మరోసారి బరిలోకి దిగుతున్నారు.
ఇక ఇండీ కూటమి తరఫున
కాంగ్రెస్ అభ్యర్ధి లక్కరాజు రామారావు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరో
ఆసక్తికరమైన అంశం ఏంటంటే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జైభారత్ నేషనల్ పార్టీ
వ్యవస్థాపకుడు జెడి లక్ష్మీనారాయణ కూడా ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్నారు.