కాంగ్రెస్,
టీఎంసీ పార్టీలకు పౌరసత్వ సవరణ చట్టంలో జోక్యం చేసుకునే ధైర్యం లేదని కేంద్రమంత్రి
అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్ లో పర్యటిస్తున్న అమిత్ షా, బంగ్లాదేశ్
నుంచి వచ్చిన హిందువులు, బౌద్ధులకు భారత్‌లో పౌరసత్వం ఇస్తే
ఇండీ కూటమి పార్టీలకు వచ్చిన సమస్యేంటని ప్రశ్నించారు. తమ రాష్ట్రంలోకి చొరబాటుదారులు
ప్రవేశించకుండా అడ్డుకోవాలన్నా, సందేశ్‌ఖాలీ తరహా ఘటనలు చోటుచేసుకోకుండా
ఉండాలంటే.. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాలన్నారు.
గత
ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు ఇచ్చారని గుర్తు చేసిన అమిత్
షా, అందుకు ప్రతిగా మోదీ రామమందిరం
తీసుకువచ్చారని చెప్పారు. ఈసారి 35 సీట్లు ఇస్తే.. చొరబాట్లను ఆపేస్తారని
వాగ్దానం చేశారు. ఓటు బ్యాంక్
రాజకీయాల్లో భాగంగానే సందేశ్ ఖాలీ బాధితులను మమతా బెనర్జీ పట్టించుకోలేదని
దుయ్యబట్టారు. బీజేపీకి ఓటు వేస్తే దీదీ
గుండాలు తలకిందులుగా వేలాడతారని వ్యాఖ్యానించారు.
పశ్చిమ
బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం
రూ.7 లక్షల కోట్లు కేటాయిస్తే టీఎంసీ నేతలు మాత్రం అవినీతికి పాల్పడ్డారని
ఆరోపించారు. 10 ఏళ్ళ కిందట చిన్నపాటి ఇళ్లల్లో ఉంటూ
సైకిల్ మీద తిరిగిన టీఎంసీ నేతలు నేడు నాలుగు అంతస్తుల భవనాల్లో ఉంటూ కార్లలో
తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ప్రజల సొమ్మేనన్నారు.