Visakhapatnam South Assembly Constituency Profile
భారతదేశపు తూర్పుతీరాన పెద్ద పారిశ్రామిక
నగరాల్లో విశాఖపట్నం ఒకటి. మన రాష్ట్రంలో సముద్రతీరాన ఉన్న అతిపెద్ద నగరం అదే. ఆ
ఒక్క నగరంలోనే ఐదు శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయంటే దాని విస్తీర్ణం ఎంతటిదో
అర్ధమవుతుంది. వాటిలో ఒకటి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం.
విశాఖ దక్షిణం, 2008 శాసనసభా నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో
భాగంగా ఏర్పడిన స్థానం. విశాఖపట్నం అర్బన్ మండలంలోని కొన్నిభాగాలతో పాటు విశాఖపట్నం
మునిసిపల్ కార్పొరేషన్‌లోని 27 వార్డులు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.
2008లో నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ
మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్ధి ద్రోణంరాజు
శ్రీనివాసరావు ప్రజారాజ్యం అభ్యర్ధి కోలా గురువులు కంటె కేవలం 341 ఓట్ల స్వల్ప
మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్ధిగా నిలబడిన వాసుపల్లి
గణేష్ కుమార్ ఓటమి పాలయ్యారు. 2014లో కోలా గురువులు వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీ
చేసారు. ఆయనను తెలుగుదేశం అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్ 18వేలకు పైగా ఓట్లతో
ఓడించారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధిగా మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ నిలబడ్డారు.
వైఎస్‌ఆర్‌సిపి తరఫున ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీ చేసారు. ఈసారి కూడా వాసుపల్లి
గణేష్ సుమారు 4వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే అనంతర కాలంలో ఆయన
వైఎస్ఆర్‌సిపికి మద్దతు ప్రకటించారు.
ఇప్పుడు 2024 శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్
ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధికార వైఎస్‌ఆర్‌సిపి తరఫున పోటీకి దిగారు. ఎన్‌డిఎ
కూటమి తరఫున జనసేన అభ్యర్ధి వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ నిలబడ్డారు. ఇండీ కూటమి
తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా జివివి హారిక తలపడుతున్నారు.