సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించిన రోజుల్లో హనుమాన్ చాలీసా విన్నా నేరమేనని ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని జైపుర్‌లో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ప్రజలు తమ మత విశ్వాసాలు పాటించాలన్నా కూడా కాంగ్రెస్ హయాంలో కష్టమేనని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో సంపద పున:పంపిణీ చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను ప్రధాని తప్పుపట్టారు.
దేశ సంపదను కాంగ్రెస్ ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తోందని ప్రధాని మోదీ రెండు రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ సంపద మొత్తం దోచుకుని కొందరు వ్యక్తులకు కాంగ్రెస్ కట్టబెట్టాలని చూస్తోందని ప్రధాని ధ్వజమెత్తారు. సంపదను లెక్కిస్తామని, పున:పంపిణీ చేస్తామన్నారని, ఆ రహస్యాన్ని బయటపెడితే ఉలిక్కి పడుతున్నారని ప్రధాని ఎద్దేవా చేశారు.
కర్ణాటకలో హనుమాన్ చాలీసా వింటున్న ఓ యువకుడిపై దాడి జరిగిన ఘటనను ప్రధాని ప్రస్తావించారు. ప్రజలు మత విశ్వాసాలను పాటించాలన్నా భయపడాల్సి వస్తోందని, హనుమాన్ చాలీసా వినాలన్నా కాంగ్రెస్ హయాంలో నేరం అయిపోయిందని మోదీ విమర్శలు చేశారు.కర్ణాటకలోని ఓ యువకుడు తన దుకాణంలో హనుమాన్ చాలీసా పెట్టుకుని వినే సమయంలో కొందరు మూకుమ్మడి దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను ప్రధాని ప్రస్తావించారు.