మరో
రెండేళ్ళలో భారత్ లో బుల్లెట్ రైలు సర్వీసు అందుబాటులోకి వస్తుందని రైల్వే మంత్రి
అశ్విని వైష్ణవ్ అన్నారు. అహ్మదాబాద్-ముంబై
మార్గంలో బుల్లెట్ రైళ్ళ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో తెలిపారు. 2026లో మొదటి విడత
ప్రాజెక్టు పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయన్నారు.
ఇప్పటికే 290 కిలోమీటర్లకు
పైగా పనులు పూర్తయ్యాయన్న కేంద్రమంత్రి, ఎనిమిది నదులపై వంతెనలు నిర్మించినట్లు
వెల్లడించారు. 12 స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయని
చెప్పారు. ప్రాజెక్ట్ పనులు 2017లో ప్రారంభమైనప్పటికీ
కోవిడ్ కారణంగా కొంత జాప్యం జరిగినట్లుగా తెలిపారు.
బుల్లెట్ రైలు కారిడార్లో 21 కిలోమీటర్ల
పొడవైన సొరంగమార్గం ఉందని వివరించారు. సొరంగం
లోపల గంటకు 300-320 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు తీస్తుందన్నారు.