శిరోముండనం కేసులో హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ మే1వ తేదీకి వాయిదా పడింది. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరో ఎనిమిది మంది ఈ పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దళిత యువకులను శిరోముండనం చేసిన కేసు గడచిన 28 సంవత్సరాలుగా విశాఖ కోర్టులో విచారణ జరిగింది. దీనిపై విశాఖ కోర్టు శిక్షలు ఖరారు చేయడంతో దోషులు, హైకోర్టులో పిటిషన్ వేశారు.
శిరోముండనం కేసులో మొత్తం తొమ్మిది మందికి 18 నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.42 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, అదనంగా 2 నెలలు జైలు శిక్ష అనుభవించాలని విశాఖ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 1996 డిసెంబరు 28న, ద్రాక్షారామం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 1997 జనవరి నాలుగో తేదీ కేసు రిజిష్టర్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను చేర్చారు. వారిలో ఒకరు మరణించారు. మిగిలిన వారికి కోర్టు శిక్షలు ఖరారు చేసింది.