ప్రజలను తప్పుదోవపట్టించేలా ఇచ్చిన ప్రకటనలపై పతంజలి సంస్థపై సుప్రీంకోర్టు గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పత్రికల్లో క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పతంజలి తీసుకున్న చర్యలను సంస్థ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. 67 పత్రికల్లో క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇచ్చినట్లు పతంజలి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే గతంలో ఇచ్చిన ప్రకటనల సైజులోనే, క్షమాపణల ప్రకటనలు కూడా ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
పతంజలి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో ఇవాళ వాదనలు వినిపించారు. రూ.10 లక్షలు ఖర్చు చేసి 67 పత్రికల్లో క్షమాపణ ప్రకటనలు ఇచ్చినట్లు చెప్పారు. ప్రకటనలు గతంలో మాదిరి మొదటి పేజీల్లో ప్రచురించారా? అదే సైజులో ప్రకటనలు ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మరోసారి అదనపు ప్రకటనలు ఇస్తామంటూ పతంజలి తరపు న్యాయవాది రోహత్గీ కోర్టుకు విన్నవించారు. పత్రికల్లో మీరు ఇచ్చిన ప్రకటనలను 2 రోజుల్లో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.
ఆధునిక వైద్యవిధానాలు, ఇంగ్లీష్ మందులపై పతంజలి సంస్థ అబద్దపు ప్రకటనలు చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కోర్టు పతంజలి సంస్థ ఉల్లంఘనలను గుర్తించి, వారిని హెచ్చరించింది. క్షమాపణలు కోరుతూ ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించింది. ఇక కోర్టు ధిక్కార కేసును కూడా ఏప్రిల్ 30న విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది.