Church publicly supports BJP, first time ever in Kerala
ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కేరళ
రాష్ట్రంలోని మొత్తం 20 పార్లమెంటరీ నియోజకవర్గాలకూ ఏప్రిల్ 26న రెండవ దశలో
పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఈసారి తప్పనిసరిగా గుర్తించదగిన విశేషం ఒకటి ఉంది.
పత్తనంతిట్ట నియోజకవర్గంలోని చర్చ్ విశ్వాసులు బీజేపీ అభ్యర్ధి అనిల్ ఆంటోనీకి మద్దతిస్తున్నట్లు
బహిరంగంగా ప్రకటించారు. ఒక చర్చ్ విభాగం బహిరంగంగా బీజేపీ అభ్యర్ధికి మద్దతు
ప్రకటించడం కేరళ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగిన అనూహ్య పరిణామమని
చెప్పవచ్చు.
తిరువల్ల ప్రాంతంలోని ఈస్టర్న్ చర్చ్ విశ్వాసులు
సోమవారం ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశంలో పత్తనంతిట్ట నియోజకవర్గంలో
బీజేపీకి మద్దతివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఆ సమావేశానికి వంద
మందికి పైగా పాస్టర్లు హాజరయ్యారు. ఆ సమావేశంలో మెట్రోపాలిటన్‌కు చెందిన మర్
సిల్వానియస్, చర్చ్ పిఆర్ఓ రెవరెండ్ ఫాదర్ సిజో పంతాపలిల్ తదితర క్రైస్తవ నాయక ప్రముఖులు
పాల్గొన్నారు. పత్తనంతిట్ట నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున అనిల్ ఆంటోనీ అభ్యర్ధిత్వానికి
మద్దతిస్తున్నట్లు ఆ సమావేశం అధికారికంగా
ప్రకటించింది. అలాగే తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖరన్
అభ్యర్ధిత్వానికి కూడా మద్దతిస్తున్నట్లు బిలీవర్స్ చర్చ్ అధికారికంగా ప్రకటించింది.
పత్తనంతిట్ట కేరళ దక్షిణ భాగంలో ఉంది. అక్కడ
గణనీయమైన సంఖ్యలో క్రైస్తవ జనాభా ఉంది. వారిలో సుమారు 10వేల కుటుంబాలు బిలీవర్స్
చర్చ్‌కు అనుబంధంగా ఉన్నారు. అంతేకాదు, ఆ చర్చ్ చిన్నచిన్న మైక్రోఫైనాన్స్
వ్యవస్థలను కూడా నిర్వహిస్తోంది. అలాంటి ప్రజాదరణ కలిగిన చర్చ్ ఒక అభ్యర్ధికి
నేరుగా మద్దతు ప్రకటించడం ఆ అభ్యర్ధికి రాజకీయంగా ఎంతో లాభం కలిగించగల అంశం.
ఈసారి ఎన్నికల్లో పత్తనంతిట్ట కేరళలోని హై-ప్రొఫైల్
రాజకీయ యుద్ధాన్ని చవిచూడనుంది. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అనిల్ ఆంటోనీ, కాంగ్రెస్
సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీ, సిపిఎంకు చెందిన మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌లతో
తలపడుతున్నారు.
అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ
ముఖ్యమంత్రి ఎకె ఆంటోనీ కుమారుడు. గతేడాది ఏప్రిల్‌లో కాంగ్రెస్‌ను వదిలి,
బీజేపీలో చేరారు. అంతకుముందు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా
కన్వీనర్‌గాను, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ సమన్వయకర్తగానూ పనిచేసారు. ఎకె ఆంటోని
మాత్రం తన కుమారుడికి అండగా నిలవడం లేదు. కాంగ్రెస్ అభ్యర్ధి ఆంటో ఆంటోనీకే మద్దతు
ప్రకటించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ పార్టీ
15 స్థానాలు గెలుచుకుంది. దాని భాగస్వామ్య పార్టీలైన ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రెండు
స్థానాలు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒకటి, కేరళ కాంగ్రెస్ (ఎం) ఒక సీటు గెలుచుకున్నాయి.
ప్రతిపక్ష సిపిఎం అలెప్పిలో ఒక సీటు గెలిచింది.