ఏపీలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. నామినేషన్లలో భాగంగా వివిధ పార్టీల అభ్యర్థులు వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటిస్తున్నారు. గుంటూరు టీడీపీ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా మొదటిసారి బరిలో దిగిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించిన ఆస్తులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం జగన్మోహన్రెడ్డి కన్నా పది రెట్లు ఎక్కువగా ఆస్తులు ప్రకటించారు.తనకు, తన భార్యకు కలపి మొత్తం రూ.5700 కోట్ల ఆస్తులున్నట్లు వివరాలు సమర్పించారు.
గుంటూరు టీడీపీ లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని పేరుపై రూ.2316 కోట్లు, భార్య శ్రీలత పేరుపై రూ.2280 కోట్ల చరాస్తులున్నాయి. ఇద్ధరికీ కలపి మరో రూ.1200 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. వీరికి రూ.519 కోట్ల అప్పులున్నాయి. రూ.6.11 కోట్ల విలువైన కార్లు, బ్యాంకులో రూ.5.9 కోట్లు, 6.86 కిలోల బంగారం, గుంటూరు జిల్లాలో రూ.2.67 కోట్ల విలువైన భూములు, హైదరాబాద్‌లో రూ. 28.1 కోట్ల భూమి, రూ.29.73 కోట్ల విలువైన భవనం, ఢిల్లీలో రూ.72 కోట్ల విలువైన భవనం, అమెరికాలో రూ.6.82 కోట్ల విలువైన భూములు, భార్య పేరిట కృష్ణా జిల్లాలో రూ.2.33 కోట్ల విలువైన పంట భూములు, ఢిల్లీలో రూ.34 కోట్ల విలువైన భవనం, అమెరికాలో రూ.28 కోట్ల విలువైన భవంతి ఉన్నాయి.