దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. మండే ఎండలకు వడగాలులు కూడా తోడయ్యాయి. మరో ఐదురోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఒడిషా నుంచి పశ్చిమబెంగాల్లోని గంగా తీరం వరకు తీవ్ర వడగాలులు వీచే ప్రమాదముందని ఐఎండి ప్రకటించింది. బెంగాల్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడు, యూపీ, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తమిళనాడు, ఏపీ, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల్లోను ఎండల తీవ్రత 45 డిగ్రీలు దాటిపోయింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మధ్యప్రదేశ్లోని తూర్పు జిల్లాల్లో రాత్రి వేళ కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
రాత్రి వేళ కూడా వేడి కొనసాగితే ప్రజల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.కాంక్రీట్ జంగిల్లా మారిన నగరాల్లో అర్భన్ హీట్ ఐలండ్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.