Vizianagaram Parliamentary Constituency Profile
విద్యల నగరంగా పేరు గడించిన ప్రాంతం విజయనగరం. రాజఠీవికి
కొదవలేని ప్రదేశం విజయనగరం. ఇక్కడ లోక్‌సభా నియోజకవర్గం 2008 నాటి నియోజకవర్గాల
పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటయింది. అంతకు ముందు బొబ్బిలి లోక్‌సభా నియోజకవర్గం
ఉండేది.
విజయనగరం పార్లమెంటరీ స్థానం పరిధిలో ఏడు శాసనసభ
నియోజకవర్గాలున్నాయి. అవి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాకు
చెందిన రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం స్థానాలు.
బొబ్బిలి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్
ఆధిక్యం ఎక్కువగా ఉండేది. 1967, 1971, 1977, 1980, 1991, 1999, 2008ఎన్నికల్లో
కాంగ్రెస్ విజయం సాధించింది. 1984, 1989, 1996, 1998, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది.
విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం 2008లో ఏర్పడింది.
2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బొత్స
ఝాన్సీలక్ష్మి తెలుగుదేశం అభ్యర్ధి కొండపల్లి అప్పలనాయుడుపై 60వేలకు పైగా ఓట్ల
మెజారిటీతో గెలుపు సాధించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఝాన్సీలక్ష్మి
మూడోస్థానానికి పరిమితమయ్యారు. వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి ఆర్‌విఎస్‌సికెకె రంగారావు
(బేబినాయన) మీద తెలుగుదేశం అభ్యర్ధి పూసపాటి అశోక్‌గజపతిరాజు లక్షకు పైగా ఓట్ల
మెజారిటీతో విజయం సాధించారు. అప్పటి ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా
పనిచేసారు. 2019 ఎన్నికల్లో అశోక్ గజపతిరాజుకు ఓటమి తప్పలేదు. వైఎస్‌ఆర్‌సిపి
అభ్యర్ధి బెల్లాన చంద్రశేఖర్ 48వేలకు పైగా ఓట్ల మెజారిటీతో అశోక్‌పై గెలిచారు.
ఇక ఇఫ్పుడు 2024లో వైఎస్‌ఆర్‌సిపి సిట్టింగ్ ఎంపీ
బెల్లాన చంద్రశేఖర్‌ను ఎన్నికల బరిలోకి దింపుతోంది. ఎన్‌డిఎ కూటమి తరఫున
తెలుగుదేశం అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు, ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి
బొబ్బిలి శ్రీను పోటీ పడుతున్నారు.