Cheepurupalli Assembly Constituency Profile
చీపురుపల్లి నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికలు ఈసారి
ఆసక్తిదాయకంగా నిలిచాయి. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధిని ఖరారు చేసే విషయంలో జరిగిన
జాప్యమే దానికి కారణం. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మీద పోటీకి ఎవరిని దింపాలా
అన్న విషయంలో టిడిపి మల్లగుల్లాలు పడింది.
విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి శాసనసభా
నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలున్నాయి. అవి
చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం. ఇక్కడ ఒక్క 70వ దశకంలో మాత్రం
కాంగ్రెస్ విజయం సాధించింది. 1983 నుంచి 1999 వరకూ తెలుగుదేశం హవాయే నడిచింది.
మళ్ళీ 2004, 2009లో కాంగ్రెస్ తరఫున బొత్స సత్యనారాయణ పోటీ చేసి విజయం సాధించారు.
వైఎస్ హయాంలో ఉండగా జరిగిన వోక్స్‌వ్యాగన్ వ్యవహారంలో ‘ఏటి సేత్తాం, సొమ్ములు
పోనాయి’ అనే మాటతో బొత్స చరిత్రలోకి ఎక్కేసారు. రాష్ట్ర విభజన ఫలితంగా 2014లో
తెలుగుదేశం అభ్యర్ధి చేతిలో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్‌సిపిలోకి మారారు. 2019లో సత్తిబాబు
విజయం సాధించారు. ఇప్పుడు మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
2024లో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద
ఎవరిని పోటీ పెట్టాలనే విషయంలో తెలుగుదేశం తర్జనభర్జనలు పడింది. గంటా
శ్రీనివాసరావును బరిలోకి దింపాలని చంద్రబాబు భావించినా దానికి గంటా ఒప్పుకోలేదు.
ఆయన భీమిలీ సీటుకోసం పట్టుపట్టి సాధించుకున్నారు. ఎట్టకేలకు సీనియర్ నాయకుడు
కిమిడి కళావెంకట్రావును చీపురుపల్లి నుంచి పోటీకి ఒప్పించారు.
ఇక ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి
తుమ్మగంటి సూరినాయుడు చీపురుపల్లి బరిలో నిలిచారు.