ఎన్నికల ఫలితాలు రాక ముందే గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేష్ కంబానీ నామినేషన్ చెల్లలేదు. నామినేషన్ పత్రాల్లో సంతకాలు సరిగా లేకపోవడంతో ఎన్నికల అధికారి నామినేషన్ చెల్లదని ధ్రువీకరించారు. ఇక బరిలో నిలిచిన మరో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్యారేలాల్ భారతి కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి నామినేషన్ ఒక్కటే మిగిలింది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.
ఎన్నికల ఫలితాలు రాకముందే బీజేపీ ఎంపీ సీటు గెలుపు ఖాయం కావడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. బీజేపీ ఎంపీ గెలుపుపై ఆనందం వ్యక్తం చేశారు. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంపై ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని, అక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని జై రామ్ రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.