Vizianagaram Assembly Constituency Profile
విజయనగరం రాజకీయం అనగానే పూసపాటి వంశస్తుల పరంపర
గుర్తుకొస్తుంది. ఒకప్పుడు రాజసంస్థానం అయిన విజయనగరం, జిల్లాగానూ రాజరికమే వెలగబెట్టింది.
ఇక్కడ ఎక్కువ కాలం పూసపాటి వంశీయులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు.
విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం 1951లో ఏర్పడింది.
ఆ స్థానంలో విజయనగరం ఒక్క మండలమే ఉంది. ఇక్కడ మొట్టమొదటి ప్రజాప్రతినిధిగా పూసపాటి
విజయరామ గజపతిరాజు 1952లో సోషలిస్టు పార్టీ తరఫున, 1955లో ప్రజాసోషలిస్టు పార్టీ
తరఫున గెలవడం విశేషం. 1957లో సోషలిస్టు పార్టీ తరఫున విజయం సాధించిన భాట్టం
శ్రీరామమూర్తి 1962లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఇక 1967లో భారతీయ జనసంఘ్
అభ్యర్ధిగా ఒబ్బిలిశెట్టి రామారావు విజయం సాధించారు. 1972లో కాంగ్రెస్ చివరిసారి
గెలిచింది. 1978 నుంచీ పూసపాటి అశోక్ గజపతిరాజు శకం మొదలైంది. మొదటిసారి జనతా
పార్టీ నుంచి గెలిచిన అశోక్, 1983 నుంచి వరుసగా టిడిపి అభ్యర్ధిగా విజయం సాధిస్తూ
వచ్చారు. 2004లో కోలగట్ల వీరభద్రస్వామి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి అశోక్‌కు
షాక్ ఇచ్చారు. మళ్ళీ 2009లో అశోక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన పార్లమెంటుకు
పోటీ చేయగా, తెలుగుదేశం తరఫున మీసాల గీత వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కోలగట్ల
వీరభద్రస్వామి మీద గెలిచారు. 2019లో వీరభద్రస్వామి
గెలిచి వైఎస్‌ఆర్‌సిపి జెండా ఎగరేసారు.
ఇప్పుడు 2024లో అధికార
వైఎస్ఆర్సిపి తరఫునసిట్టింగ్ ఎమ్మెల్యే
కోలగట్ల వీరభద్రస్వామి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఎన్‌డిఎ కూటమి తరఫున టీడీపీ అభ్యర్ధి,
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అదితి గజపతిరాజు మళ్ళీ బరిలోకి దిగుతున్నారు.
ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి సుంకర సతీష్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు.