His aim is to contest in 100 elections
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన హస్నూరామ్ అంబేద్కరీ
వయసు 79ఏళ్ళు. ఈ ఎన్నికల సీజన్లో ఆయన పత్రికల పతాకశీర్షికలకు ఎక్కాడు. కారణం,
ఈసారి ఆయన 99వ సారి ఎన్నికల బరిలో నిలవడమే.
హస్నూరామ్ మొట్టమొదటిసారి 1985లో ఎన్నికల్లో పోటీ
చేసారు. అప్పటినుంచి ఇప్పటివరకూ మొత్తం 98సార్లు ఎన్నికల బరిలో నిలిచారు. విచిత్రం
ఏంటంటే ఆయన ఒక్కసారి కూడా గెలవలేదు. ఆఖరికి డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అయినా
ఎన్నికల్లో పోటీ చేయాలన్న తపన ఆయనలో తగ్గలేదు.
ఈసారి కూడా హస్నూరామ్ ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం
నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేసారు. అయితే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురవడంతో
99వసారి ఎన్నికలో పోటీ చేయడం సాధ్యం కాలేదు. వందసార్లు ఎన్నికల్లో పోటీ చేయాలన్న
లక్ష్యం ఇంకా రెండు ఎన్నికల దూరంలో ఉండిపోయింది.
హస్నూరామ్ అంబేద్కరీకి ఎన్నికల్లో అభ్యర్ధిగా
పోటీ చేయడం అంటే ఉన్న ఇష్టాన్ని అతని కుటుంబసభ్యులు గౌరవిస్తున్నారు. అందుకే
ఇన్నాళ్ళుగా ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రతీ చిన్న ఎన్నికలోనూ అభ్యర్ధిగా
నిలబడుతూనే ఉన్నాడు.
హస్నూరామ్ కొన్నాళ్ళు గుమస్తాగా ఉద్యోగం చేసారు.
మరికొన్నాళ్ళు ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీగానూ పనిచేసారు. తన పని ఏదైనా,
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీసారీ తన సొంత డబ్బులనే ఖర్చు పెట్టుకుంటూ వచ్చారు.
‘‘ఎన్నికల్లో పోటీ చేయడమంటే నాకు ఇష్టం. నా సొంత
ఖర్చులతో నేను పోటీ చేస్తున్నాను. ఇప్పటివరకూ నేను ఎవరినుంచీ ఎలాంటి ఆర్థిక సహాయమూ
తీసుకోలేదు. నేను గెలవను అన్న విషయం నాకు తెలుసు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా
ఆగను’’ అంటారు హస్నూరామ్ అంబేద్కరీ.
ఇంక తనకు ఎంతో సమయం లేదని, వీలైనంత త్వరగా తన
లక్ష్యాన్ని సాధించాలనీ ఆయన భావిస్తున్నారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయడంలో సెంచరీ
సాధించాలన్నది నా తపన. నాకు వయసు పైబడిపోతోందన్న సంగతి నాకు తెలుసు. నేను
చనిపోయేలోగా నా లక్ష్యాన్ని సాధించి తీరతాను’’ అని హస్నూరామ్ అంబేద్కరీ
ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు