Repolling in 11 stations in Manipur
మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గం
పరిధిలోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఈ రీపోలింగ్ కోసం పటిష్ట
భద్రతా ఏర్పాట్లు చేసామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ
అధికారులు వెల్లడించారు.
మణిపూర్‌లో ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు
జరిగాయి. అయితే 11 కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ చెల్లదంటూ రద్దు
చేసింది. అక్కడ హింసాత్మక ఘటనలతో పాటు ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలు కూడా చోటు
చేసుకున్నాయి. దాంతో ఇవాళ రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం
తీసుకుంది.
‘‘శుక్రవారం జరిగిన పోలింగ్ సమయంలో 11
కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. దాంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నాము. ప్రజలు తమ
ఓటుహక్కును వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాల దగ్గర ఉదయం నుంచే బారులు తీరారు’’
అని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని 11
పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఏప్రిల్ 19న జరిగిన
ఎన్నికల సమయంలో ఆ కేంద్రాల్లో కాల్పులు, బెదిరింపులు, ఈవీఎంల ధ్వంసం, బూత్
కాప్చరింగ్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలకు ముందు మణిపూర్‌లో హింసాకాండ
చెలరేగిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ సమయంలో కూడా ఉద్రిక్త సంఘటనలు చోటు
చేసుకున్నాయి.
మణిపూర్‌లో రెండు లోక్‌సభ
నియోజకవర్గాలు ఉన్నాయి. ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ అనే ఆ రెండు స్థానాలకూ మొదటి
దశలోనే ఎన్నికలు జరిగాయి. మొత్తం 72శాతం పోలింగ్ నమోదయింది. ఔటర్ మణిపూర్‌లోని 13
సెగ్మెంట్లకు మాత్రం ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరుగుతుంది.