కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల భూములు, ఆస్తులు ముస్లింలకు పంచుతుందని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్‌లోని బస్స్వారాలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తుల పున:పంపిణీ చేస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆస్తులపై సర్వే చేస్తున్నారని ధ్వమెత్తారు.
మహిళల వద్ద ఎంత బంగారం ఉంది, ఉద్యోగుల వద్ద ఎంత ఆస్తి ఉంది, ప్రజల భూములపై కాంగ్రెస్ ఆరా తీస్తోందని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు కూడా వదలరని, బంగారం అనేది ఆస్తి కాదని మహిళల ఆత్మగౌరవం అని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
దేశంలోని ఆస్తుల్లో మొదటి హక్కు ముస్లింలకే ఉందని మన్మోహన్‌సింగ్ సర్కార్ చెప్పింది. ప్రజల ఆస్తులు చొరబాటుదారులకు పంచడానికి మీకు ఇష్టమేనా అని ప్రధాని మోదీ ప్రజలను ప్రశ్నించారు. ఎక్కువ మంది పిల్లలున్న వారికే ఆస్తులు చెందేలా కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.