ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి రంగం సిద్దమైంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో ఏటా కల్యాణం నిర్వహిస్తుంటారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు కల్యాణం వీక్షించవచ్చు.
శ్రీసీతారాముల కల్యాణం వీక్షించడానికి లక్షన్నర మంది భక్తులు హాజరవుతారని అంచనా.తొక్కసలాటలు జరగకుండా 1500 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు తిరుమల శ్రీవారి ప్రసాదం పంపిణీ చేయనున్నారు. నేరుగా వీక్షించలేని వారి కోసం 28 భారీ తెరలను ఏర్పాటు చేశారు.పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.