బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దోపిడీకి తెగబడుతున్నారు. ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేసుకుంటే గ్రాము బంగారం 5 వేలకే ఇస్తామంటూ తిరుపతికి చెందిన గంటా శ్రీధర్ రూ.6 కోట్లకుపైగా మోసం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
తిరుపతికి చెందిన గంటా శ్రీధర్, హైదరాబాద్లోని మాదాపూర్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. కొండాపూర్లో నివాసం ఉంటున్నాడు. కొంపల్లిలో ఓ వ్యాపారి ద్వారా పరిచయాలు బాగా పెంచుకున్నాడు. మార్కెట్ ధర కంటే 30 శాతం తక్కువకే బంగారం ఇస్తానంటూ నమ్మబలికాడు. అయితే ముందుగా డబ్బు చెల్లించి బుక్ చేసుకోవాలని షరతు పెట్టాడు. అలా కొంపల్లికి చెందిన వ్యాపారి వద్ద నుంచి రూ.1.48 కోట్లు, పరిచయస్తుల వద్ద నుంచి మరో రూ.5కోట్లు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో బాధితులకు విషయం అర్థమైంది. మోసపోయినట్లు గ్రహించారు. చివరకు బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.
దాదాపు 12 మంది నుంచి 6 కోట్లకుపైగా వసూలు చేసిన గంటా శ్రీధర్ తిరుపతిలో పనుందని రాగానే బంగారం ఇస్తానంటూ కనిపించకుండా పోయాడు. ఫోన్ స్విచాఫ్ చేశాడు. కొండాపూర్లో ఇళ్లు ఖాళీ చేశాడు. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.