పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి ప్రతీకారదాడులకు దిగింది. ప్రపంచంలోనే అత్యాధునిక రక్షణ వ్యవస్థల్లో ఒకటైన ఎస్ 300 కేంద్రాన్ని ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి. క్షిపణి వ్యవస్థను పసిగట్టి ముందుగానే కూల్చివేసే సామర్థ్యం ఉన్న ఇరాన్‌లో ఎస్ 300 కేంద్రాన్ని కూల్చివేయడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇది నిజమైతే ఇరాన్ అణు రక్షణ వ్యవస్థ ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాడార్ వ్యవస్థకు చిక్కకుండా ఇజ్రాయెల్ సైన్యం దాడిచేయడం ఇప్పుడు అగ్రదేశాలకు కూడా నిద్రలేకుండా చేసింది. ఇరాన్‌లోని నంతాజ్ అణుకేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్ 300 వ్యవస్థను కూల్చివేయడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇరాన్‌లో ఎక్కడైనా దాడి చేయగల సామర్థ్యం తమకుందని ఇజ్రాయెల్ మరోసారి రుజువు చేసుకుంది. యుద్ధ విమానం ద్వారా ఎస్ 300 వ్యవస్థను ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.