Tekkali Assembly Constituency Profile
శ్రీకాకుళం జిల్లాలో ఆసక్తికరమైన శాసనసభా నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి.
అక్కడ ఈసారి బరిలో నిలబడిన ముగ్గురు ప్రధాన అభ్యర్ధులకూ తమదైన ప్లస్‌లూ మైనస్‌లూ
ఉన్నాయి.
టెక్కలి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఈ స్థానంలో నందిగం, టెక్కలి,
సంతబొమ్మాళి, కోటబొమ్మాళి అనే నాలుగు మండలాలు ఉన్నాయి.
టెక్కలిలో తొలినాళ్ళలో కాంగ్రెస్, స్వతంత్ర, జనతా పార్టీలు అధికారం
సాధించగలిగాయి. 1983 నుంచీ తెలుగుదేశం హవా మొదలైంది. 1994లో స్వయానా ఎన్‌టిఆర్
ఇక్కడినుంచి పోటీ చేయడం విశేషం. అలా 1999 వరకూ టిడిపి జెండా ఎగిరింది. 2004, 2009
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆధిపత్యం సాధించింది. ఇంక 2014, 2019
ఎన్నికల్లో తెలుగుదేశం పుంజుకుంది. ఈ స్థానాన్ని ఇప్పుడు 2024లో టిడిపి నిలబెట్టుకోగలదా
అన్నది ఆసక్తికరం.
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ
చేస్తున్నారు. అయితే ఆయన మీద ఆయన భార్యే రెబెల్‌గా నామినేషన్ వేసారు. ఇది
దువ్వాడకు ఇబ్బందికరమైన పరిణామం.
ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధిగా కింజరాపు అచ్చెన్నాయుడు
పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పరిస్థితి గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి
హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ దశలో చంద్రబాబు అచ్చెన్నాయుడుకు
టికెట్ ఇస్తారా లేదా అన్న అనుమానాలూ తలెత్తాయి. ఎలాగోలా అచ్చెన్నకు టికెట్ దక్కినా,
ఆయన రెండోసారి గెలుస్తారా లేదా అన్నది చూడాలి.
వీరిద్దరూ ఇలా ఉంటే, ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధిగా కిల్లి
కృపారాణి బరిలోకి దిగుతున్నారు. వృత్తిరీత్యా వైద్యురాలైన కిల్లి కృపారాణి వైఎస్ఆర్
పాదయాత్ర సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 2019లో వైఎస్ఆర్‌సిపిలో చేరారు. 2024
ఎన్నికలకు ముందు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్‌లో చేరారు. ఎక్కువ సార్లు లోక్‌సభకే
పోటీపడిన కృపారాణి, శాసనసభ బరిలో మొదటిసారి నిలవడం విశేషం.