Pathapatnam Assembly Constituency Profile
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం శాసనసభా నియోజకవర్గం 1951లో
ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో పాతపట్నం, మెళియాపుట్టి, ఎల్ ఎన్ పేట, కొత్తూరు,
హీరమండలం అనే ఐదు మండలాలు ఉన్నాయి.
నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్ళలో పాతపట్నం కాంగ్రెస్ పార్టీకి
విధేయంగా ఉండేది. 1983లో తెలుగుదేశం గెలిచినా 1985లో మళ్ళీ కాంగ్రెస్ తమ ఆధిపత్యం
నిరూపించుకుంది. ఆ తర్వాత నుంచీ 2009 వరకూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ
వరుసగా గెలుస్తూ వచ్చింది. 2009లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్ధి గెలిచినా, ఆ తర్వాత
రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. 2014, 2019
రెండుసార్లూ వైఎస్ఆర్సిపి విజయం సాధించింది. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలని
భావిస్తోంది. అయితే వైఎస్ఆర్సిపి జోరుకు బ్రేకులు వేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
పాతపట్నంలో 2014లో కలమట వెంకటరమణమూర్తి వైఎస్ఆర్సిపి అభ్యర్ధిగా
సుమారు 4వేల మెజారిటీతో గెలిచారు. కానీ కొన్నాళ్ళకే పార్టీ మారి, తెలుగుదేశం
కండువా కప్పుకున్నారు. 2019లో తెలుగుదేశం అభ్యర్ధిగా నిలిచారు. ఆయన మీదకు వైఎస్ఆర్సిపి
రెడ్డి శాంతిని పోటీలో నిలబెట్టింది. ఆమె 15.5వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం
సాధించారు. ఈసారి కూడా వైఎస్ఆర్సిపి తమ టికెట్‌ను ఆమెకే కేటాయించింది.
ఎన్‌డిఎ కూటమి పొత్తులో భాగంగా పాతపట్నం టికెట్ తెలుగుదేశానికి
దక్కింది. కలమట వెంకటరమణ మూర్తికే టికెట్ ఇస్తామని తెలుగుదేశం మొదట్లో చెప్పినా,
తర్వాత మాట మార్చింది. పార్టీలోని అసంతృప్త నాయకుడు మామిడి గోవిందరావును బరిలోకి
దింపింది. ఇక ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కొప్పురోతు వెంకట్రావు పోటీ పడుతున్నారు.