పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాలు ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. ఆరు దశాబ్దాల కిందట కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం అక్కడ నుంచే రాజకీయాలు మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించిన తరవాత రెడ్డి రాజకీయాలకు పేటలో బ్రేక్ పడింది. 1983 నుంచి అక్కడ టీడీపీ నుంచి కొడెల శివప్రసాదరావు వరుసగా ఐదుసార్లు విజయకేతనం ఎగురవేశారు. ఆ తరవాత కాసు వారసుడు కాసు కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి 2004లో గెలిచారు. 2014 నుంచి పేట వైసీపీకి కంచుకోటగా మారింది.
నరసరావుపేట వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి మూడోసారి బరిలో నిలిచారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. 2014లో కొడెల సత్తెనపల్లి నుంచి పోటీ చేయడంతో పేటలో టీడీపీ బాగా బలహీనపడింది. వైసీపీని ఎదుర్కొనే సత్తాలేని టీడీపీ అభ్యర్థులు 2014, 2019లో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా అరవిందబాబు బరిలో నిలిచారు. ఆయన సౌమ్యుడు కావడంతో టీడీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గెలుపు ఖాయంగా చెప్పవచ్చు. టీడీపీ అధినాయకత్వం 2019 తరవాత మూడేళ్లపాటు అక్కడ ఇంఛార్జిని ప్రకటించకపోవడం, 2021లో అరవిందబాబును ఇంఛార్జిగా నియమించినా పార్టీని పరుగులు పెట్టించడంలో, అన్ని వర్గాలను కలుపుకుని పోవడంలో ఆయన విఫలమయ్యారనే సమాచారం అందుతోంది. నరసరావుపేటలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాసరెడ్డి గెలపు ఖాయంగానే చెప్పవచ్చు.