కర్ణాటక కార్పొరేటర్ కుమార్తె హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. హుబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను, ఫయాజ్ ఖోండునాయక్ ఏడుసార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. హుబ్లీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న నేహాను, గతంలో క్లాస్‌మేట్ ఫయాజ్ ఖోండునాయక్ అనేకమార్లు పొడిచి చంపినట్లు విచారణలో వెల్లడైంది. వారిద్దరూ కొంతకాలం సహజీవనంలో ఉన్నారని, ఆమె అతన్ని దూరం పెట్టడంతో పొడిచి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
నేహా హత్య కేసు అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ రచ్చకు దారితీసింది. ఈ ఘటన వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తుండగా, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. నేహా హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని ధార్వాడ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని జోషి విమర్శలు చేశారు. మైనారిటీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య కోరారు. నేహా హత్యలో లవ్ జిహాద్ లేదని హోం మంత్రి జి.పరమేశ్వర చెప్పుకొచ్చారు.
హత్యకు గురైన నేహా తండ్రి, కాంగ్రెస్ నేత నిరంజన్ హిరేమత్ కూడా ఇది లవ్ జిహాద్ అని చెప్పడంతో కాంగ్రెస్ నేతలు ఇరకాటంలో పడ్డారు. తన కూతురుని ట్రాప్ చేశాడని హిరేమత్ పేర్కొన్నారు. నేహా హత్య వ్యక్తిగతం అని చెబుతున్నారు. వారిద్దరూ ఏమైనా బంధువులా అంటూ హిరేమత్ ప్రశ్నించారు. నా కూతురుని ట్రాప్ చేశారు. ఉరితీయాలని చూశారు. బెదిరింపులకు దిగారు. అయినా నా కూతురు ఖాతరు చేయలేదు. నా కూతుకు ఏమైందో దేశం, రాష్ట్రం మొత్తం చూసిందని హిరేమత్ చెప్పారు.
నేహా హత్యపై కేంద్ర మంత్రి మీనాక్షి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీ అంటే అవినీతి, నేరం, మత హింసని ఆమె ధ్వజమెత్తారు.పాఠశాలల్లో పిల్లలకు నైతిక పాఠాలు చెప్పేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యం, ఈ విషయంలో ప్రజలకు కూడా సరైన అవగాహన ఉండాలని కేంద్ర మంత్రి హితవు పలికారు.తప్పు చేసిన వారిని
ప్రభుత్వం శిక్షిస్తుందని ప్రజలకు నమ్మకం ఉండాలి. అయితే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి మీనాక్షి విమర్శించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయనే నెపం వేసి, గవర్నర్ పాలన పెట్టాలని చూస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు అర్. అశోక అన్నారు. అయితే ఇది అసాధ్యమని స్పష్టం చేశారు. నేహా హత్యను ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు హుబ్లీలోని విద్యానగర్ పోలీస్‌స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.