64pc polling recorded in first phase of elections
18వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ గురువారం
ప్రారంభమైంది. మొదటి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102
నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆ దశలో 64శాతం పోలింగ్ నమోదయింది. మణిపూర్,
బెంగాల్లో చిన్నచిన్న అలజడులు మినహా మొత్తంగా చూసుకుంటే ప్రశాంతంగానే పోలింగ్
ప్రక్రియ పూర్తయింది.
మొదటి విడత లోక్‌సభ ఎన్నికలతోపాటు సిక్కిం,
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరిగాయి. సిక్కింలో 68శాతం,
అరుణాచల్ ప్రదేశ్‌లో 68.3శాతం పోలింగ్ నమోదయింది. 2019లో సిక్కింలో 81.4శాతం,
అరుణాచల్ ప్రదేశ్‌లో 65.1శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం.
తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ
మొదటిదశలోనే ఒకేవిడతలో ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో 67.2శాతం పోలింగ్
నమోదయింది. అదే రాష్ట్రంలో 2019లో 72.4శాతం పోలింగ్ నమోదయింది. అంటే ఈ యేడాది సుమారు
6శాతం పోలింగ్ తగ్గింది.
రాజస్థాన్‌లోని మొత్తం 25 స్థానాల్లో మొదటి దశలో
12 స్థానాలకు, అంటే దాదాపు సగం రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ 57.3శాతం
మాత్రమే పోలింగ్ నమోదయింది. 2019లో నమోదైన 64శాతం పోలింగ్ కంటె సుమారు 7శాతం
తగ్గిందన్నమాట.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 8సీట్లకు జరిగిన
ఎన్నికల్లో 59.5శాతం పోలింగ్ నమోదయింది. మధ్యప్రదేశ్‌లో 6 సీట్లకు జరిగిన ఎన్నికల్లో
66.7శాతం ఓటింగ్ జరిగింది. ఇక పశ్చిమబెంగాల్లో పోలింగ్ గణనీయంగా జరగడం గమనార్హం.
అక్కడ 3 నియోజకవర్గాలకు జరిగిన ఓటింగ్‌లో 77.6శాతం పోలింగ్ నమోదయింది. బెంగాల్‌లోని
42 ఎంపీ సీట్లలో 2019లో బీజేపీ 18 స్థానాలు గెలుచుకోవడం విశేషం.
బీజేపీ ఆధిక్యం ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్
ఘనంగా జరిగింది. అస్సాంలో 5 నియోజకవర్గాల్లో 72.3శాతం, మేఘాలయలోని మొత్తం 2
నియోజకవర్గాల్లో 74.5శాతం, మణిపూర్‌లోని మొత్తం 2 నియోజకవర్గాల్లో 69.2శాతం, అరుణాచల్
ప్రదేశ్‌లోని మొత్తం 2 నియోజకవర్గాల్లో 67.7శాతం పోలింగ్ జరిగింది. ఇక అన్ని
రాష్ట్రాల కంటె ఎక్కువగా త్రిపురలోని 1 నియోజకవర్గంలో 80.6శాతం పోలింగ్ నమోదయింది.
పశ్చిమబెంగాల్లోని కూచ్‌బెహార్‌లో తృణమూల్,
బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ ఏజెంట్ల మీద దాడి జరిగింది.
ఓటర్లను భయభ్రాంతులను చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి హింసా
జరగలేదనే చెబుతున్నారు.
మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో ఒక పోలింగ్ స్టేషన్
దగ్గర తుపాకి కాల్పుల ఘటన చోటు చేసకుంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో ఒక పోలింగ్
స్టేషన్‌ను ధ్వంసం చేసారు. తమిళనాడులోని సేలం జిల్లాలో వేర్వేరు పోలింగ్ కేంద్రాల
దగ్గర ఇద్దరు వృద్ధులు మరణించారు.
ఈ ఘటనలు మినహా మొదటి దశ
పోలింగ్ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని ఎన్నికల కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.