Araku Lok Sabha Constituency Profile
పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో
భాగంగా అరకు ఎంపీ స్థానం 2008లో ఏర్పాటైంది. అంతకు ముందున్న పార్వతీపురం
నియోజకవర్గం రద్దయింది. అరకు షెడ్యూల్డు తెగలకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం.
అరకు లోక్‌సభా స్థానంలో రెండు జిల్లాలు, ఏడు
అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పాలకొండ,
కురుపాం, పార్వతీపురం, సాలూరు శాసనసభా నియోజకవర్గాలు… అల్లూరి సీతారామరాజు
జిల్లాకు చెందిన అరకులోయ, పాడేరు, రంపచోడవరం శాసనసభా నియోజకవర్గాలు… ఈ లోక్‌సభ
స్థానంలోని సెగ్మెంట్లు.
అరకు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారి 2009లో
లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు పోటీ ప్రధానంగా
కాంగ్రెస్ అభ్యర్ధి కిషోర్ చంద్రదేవ్, సిపిఎం అభ్యర్ధి మిడియం బాబూరావు మధ్య జరిగింది.
ఆ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అంతకుముందు పార్వతీపురం ఎంపీ సీటులో
ఎప్పుడూ దాదాపు కాంగ్రెస్ పార్టీయే గెలిచేది.
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా
విడిపోయిన తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. అదే ఫలితం అరకు
నియోజకవర్గంలో కూడా ప్రతిఫలించింది. రాష్ట్ర విభజన తర్వాత అరకు ఓటరు వైఎస్ఆర్సిపి
వైపే మొగ్గాడు.
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి చెందిన
కొత్తపల్లి గీత, తెలుగుదేశం అభ్యర్ధి గుమ్మిడి సంధ్యారాణిపై విజయం సాధించారు.
2019లో వైఎస్ఆర్సిపికి చెందిన గొడ్డేటి మాధవి, టిడిపి అభ్యర్ధి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్
మీద ఘనవిజయం దక్కించుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్ సాధించాలని వైఎస్ఆర్సిపి
ఉత్సాహంగా ఉంది. ఆ పరంపరను విచ్ఛిన్నం చేయాలని ఎన్‌డిఎ కూటమి ప్రయత్నిస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరఫున
చెట్టి తనూజారాణి పోటీ చేస్తున్నారు. ఆమెపై ఎన్‌డిఎ కూటమి నుంచి బిజెపి అభ్యర్ధిగా
కొత్తపల్లి గీత బరిలోకి దిగారు. ఇక ఇండీ కూటమి నుంచి సిపిఎం అభ్యర్ధిగా పాచిపెంట
అప్పలనరస నిలబడుతున్నారు.
కొత్తపల్లి గీత 2014లో
వైసీపీ నుంచి గెలిచి, నాలుగేళ్ళకే ఆ పార్టీని వదిలిపెట్టిన కొత్తపల్లి గీత 2018
ఆగస్టులో జనజాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అయితే 2019 జూన్‌లో ఆమె బీజేపీలో
చేరారు. 2014 ఎన్నికల సమయంలో ఆమె కులంపై వివాదం రేగింది. అయితే, గీత ఎస్టీ కాదంటూ
వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ చెల్లదని రాష్ట్ర హైకోర్టు ఈ యేడాది జనవరిలో
తీర్పునిచ్చింది. దాంతో గీత అభ్యర్ధిత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి.