వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ సూచీలు బయటపడ్డాయి. ఉదయం నష్టాలతో మొదలైనా, మధ్యాహ్నం తరవాత స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కుదేలైన స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడి చేసే ఆలోచన లేదని, ఇరాన్ ప్రకటించడంతో పెట్టుబడిదారులు భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపారు.
నష్టాలతో 71999 వద్ద మొదలైన సెన్సెక్స్ మధ్యాహ్నం తరవాత కోలుకుంది. చివరకు 599 పాయింట్ల లాభంతో 73088 వద్ద ముగిసింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 22147 వద్ద స్థిరపడింది.రూపాయి మారకం విలువ రూ.83.46గా ఉంది.
బజాజ్ ఫైనాన్స్, మారుతీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలార్జించాయి. నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, టీసీఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. బ్యారెల్ ముడిచమురు ధర రూ.86.35 డాలర్లకు పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ముడిచమురు ధరలపై పడింది.