Araku Assembly Constituency Profile
అరకులోయ మొదట్లో విశాఖపట్నం జిల్లాలో ఉండేది.
జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమైంది. అరకు
ప్రత్యేకమైన నియోజకవర్గంగా 2008లో ఏర్పడింది.
అరకులోయ శాసనసభా నియోజకవర్గంలో ఆరు మండలాలు
ఉన్నాయి. ముంచింగిపుట్టు, పెదబయలు, డుంబ్రిగూడ, అరకులోయ, హుకుంపేట, అనంతగిరి.
వాటిలో మొదటి మూడు మండలాల్లోనూ నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువ. మిగిలిన మండలాల్లో
కూడా వారి ప్రభావం ఉంది.
కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటికి
మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున సివేరి సోమ
విజయం సాధించారు. 2014లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కిడారి సర్వేశ్వర రావు గెలిచారు. ఎన్నికల తర్వాత
తెలుగుదేశంలోకి ఫిరాయించారు. మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, సిట్టింగ్ ఎమ్మెల్యే
కిడారి సర్వేశ్వరరావు ఇద్దరినీ 2018లో నక్సలైట్లు హతమార్చారు. ఆ తర్వాత సర్వేశ్వరరావు
కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌ను అప్పటి టిడిపి ప్రభుత్వం మంత్రిని చేసింది.
అయితే ఎమ్మెల్యేగా గెలవకుండానే ఆయన పదవీకాలం ముగిసిపోయింది. 2019 ఎన్నికల్లో
తెలుగుదేశం శ్రావణ్ కుమార్‌ను బరిలోకి దింపినా సానుభూతి దక్కలేదు. వైఎస్‌ఆర్‌సిపి
అభ్యర్ధి చెట్టి ఫల్గుణ విజయం సాధించారు.
2024 శాసనసభ ఎన్నికల్లో
అధికార వైఎస్‌ఆర్‌సిపి తరఫున రేగం మత్స్యలింగం పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్‌డిఎ
కూటమి తరఫున బీజేపీ అభ్యర్ధి పంగి రాజారావు బరిలో ఉన్నారు. ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధి శెట్టి గంగాధరస్వామి ఉన్నప్పటికీ, ఆ కూటమిలోనే ఉన్న సిపిఎం అభ్యర్ధిగా
దీసరి గంగరాజు కూడా పోటీ పడుతున్నారు.