Paderu Assembly Constituency Profile
ఒకప్పుడు విశాఖపట్నం జిల్లాలో ఉన్న పాడేరు
ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్భాగంగా ఉంది. పాడేరు నియోజకవర్గం 1967లో
ఏర్పాటైంది. షెడ్యూల్డు తెగలవారికి రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో ఐదు మండలాలు
ఉన్నాయి. పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, గూడెం కొత్త వీధి, కొయ్యూరు.
పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ మావోయిస్టుల
ప్రాబల్యం ఈనాటికీ ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో నక్సలైట్ల ఉనికి
దాదాపు తగ్గిపోయినా, ఇంకా ఈ నియోజకవర్గ పరిధిలో వారి కార్యాచరణ అప్పుడప్పుడూ
కనిపిస్తూనే ఉంటుంది.
తొలినాళ్ళలో కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో
1985 నుంచీ తెలుగుదేశం ప్రాబల్యం మొదలైంది. 1989లో మళ్ళీ కాంగ్రెసే గెలిచినా,
1994, 1999లో తెలుగుదేశం నిలబడింది. అయితే 2004లో ఇక్కడ బిఎస్పి అభ్యర్ధి
గెలవడం విశేషం. 2009లో మళ్ళీ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత 2014లో గిడ్డి ఈశ్వరి,
2019లో కొత్తగుల్లి భాగ్యలక్ష్మి వైఎస్ఆర్సీపీ టికెట్‌పై గెలిచారు. వైఎస్‌ఆర్‌సిపి
రెండుసార్లు గెలిచినా, అభ్యర్ధులను మార్చేసింది. ఈసారి కూడా ఆ పార్టీ అభ్యర్ధిగా సిట్టింగ్
ఎమ్మెల్యే కాక కొత్త అభ్యర్ధి ఎం విశ్వేశ్వర రాజు బరిలోకి దిగుతున్నారు.
ఎన్‌డిఎ కూటమి తరఫున ఈ సీటును బిజెపికి
కేటాయించారు. ఆ పార్టీ తరఫున కె వెంకట రమేష్ నాయుడు పోటీలో ఉన్నారు. అలాగే ఇండీ
కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్ధి సతక బుల్లిబాబు పోటీ పడబోతున్నారు.
వైసిపి 2014కు, 2019కి
అభ్యర్ధిని మార్చినప్పటికీ మెజారిటీ గణనీయంగా పెరగడం విశేషం. ఇప్పుడు కూడా అదే
చరిత్ర పునరావృతం అవుతుందని వైసీపీ ధీమాగా ఉంది. కానీ ఈసారి ఎలాగైనా మావోయిస్టుల
ప్రాబల్య ప్రాంతంలో పాగా వేసి తీరాలని బిజెపి భావిస్తోంది. దానికి తెలుగుదేశం,
జనసేన పార్టీలు మద్దతిస్తాయని ఆశిస్తోంది.