ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారు. నాగాలాండ్‌లో ఆరు జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ప్రత్యేక టెరిటరీని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈఎన్‌పీవో ఎన్నికలు బహిష్కరిస్తూ పిలుపునిచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంతో వారు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్నారు. తాజాగా ఎంపీ ఎన్నికలను ఆరు జిల్లాల ఓటర్లు బహిష్కరించారు. ఆ జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా ఎన్నికల్లో పాల్గొనలేదు.
ప్రత్యేక పాలన కోసం నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈఎన్‌పీవో ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునివ్వడంపై ఈశాన్యరాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం, ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి ఆటంకం కలిగించడానికి గల కారణాలు తెలపాలంటూ సెక్షన్ 171సీ కింద ఈఎన్‌పీవోకు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలను అడ్డుకోవడం, ఎన్నికలను బహిష్కరించడం, ఓటింగ్‌లో పాల్గొనరాదని పిలుపునివ్వడంలాంటి చర్యలు నేరంగా పరిగణిస్తారు.
ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఈఎన్‌పీవో స్పందించింది. తూర్పునాగాలాండ్లో ప్రస్తుతం ఎమర్జెన్సీలో ఉన్నట్లు ఉందని, ఇక్కడ ఉద్రిక్తత తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పింది. ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నికలు బహిష్కరించారు. కాబట్టి 171సీ వర్తించదని ఈఎన్‌పీవో సంస్థ స్పష్టం చేసింది.
గత నెలలో తూర్పు నాగాలాండ్ ప్రాంతంలోని 20 మంది ఎమ్మెల్యేల బృందంతో ఈఎన్‌పీవో సంస్థ చర్చలు జరిపింది. ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎమ్మెల్యేల బృందం ఈఎన్‌పీవో సంస్థను కోరింది. ఆ తరవాత ఈఎన్‌పీవో ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ నిర్ణయం తేలిగ్గా తీసుకుంది కాదని ప్రజల మనోభావాల మేరకు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్