తిరుమలలో
సాలకట్ల వసంతోత్సవాలు నేత్రపర్వంగా జరగనున్నాయి. ప్రతీ ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి
ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా
జరుగనున్నాయి.
ఏప్రిల్
21న ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి మాడవీధులలో
విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
వసంతోత్సవ మండపానికి వేంచేసి అభిషేక నివేదనలు
అందుకుంటారు.
ఏప్రిల్
22న బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ
వీధులలో దర్శనమిస్తారు. వసంత మండపంలో
అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఏప్రిల్
23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో
పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ
వేడుకల్లో పాల్గొంటారు.
వసంత
ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవం’అని పేరు. వసంతోత్సవాన్ని
పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టాదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుంచి 23 వరకు కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేసినట్లు
టీటీడీ వెల్లడించింది.