భార్యాభర్తలు ఎన్నికల్లో పోటీచేయడం చూస్తూనే ఉన్నాం. అయితే వారు ప్రత్యర్థులుగా ఒకే నియోజకవర్గంలో తలపడటం మాత్రం చాలా అరుదు. అలాంటిదే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో చోటుచేసుకోనుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు సొంత ఇంటి నుంచే తిరుగుబాటు మొదలైంది. భార్య వాణి గత కొంత కాలంగా దువ్వాడ శ్రీనివాస్ వైఖరిపై అసంతృప్తిగా ఉంది. ఆరు నెలల కిందటి వరకు టెక్కలి వైసీపీ ఇంఛార్జిగా పనిచేసిన వాణికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలితో కార్యకర్తలు విసిగిపోయారని గతంలో ఆమె సీఎంకు ఫిర్యాదు కూడా చేశారు. చివరకు ఆమెను తప్పించి శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వడంతో, రెబల్‌గా బరిలో దిగనున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది.
దువ్వాడ వాణి మొదటి నుంచి వైసీపీలో చాలా చురుగ్గా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడవలతో దువ్వాడ శ్రీనివాస్ వెలుగులోకి వచ్చారు. సాక్షాత్తూ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామంలో కూడా వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడంతో దువ్వాడకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఆయన భార్య వాణి స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలిచింది. అప్పటి నుంచి వైసీపీలో చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. పార్టీ కూడా ఆమెను గుర్తించి టెక్కలి వైసీపీ ఇంఛార్జ్ పదవి కట్టబెట్టింది.
దువ్వాడ శ్రీనివాస్‌తో వాణికి విభేదాలు కొనసాగుతున్నారు. ఇద్దరూ వేరువేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం కూడా వాణి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో విసిగిపోయిన కార్యకర్తలు వాణి వర్గంలో చేరారు. దీంతో ఆమె బలం పెరిగింది. 22వ తేదీ రెబెల్ అభ్యర్థిగా వాణి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ అధినేత దువ్వాడ శ్రీనివాస్‌ను మార్చి వాణికి టికెట్ ఇస్తారా లేదా అనే దానిపై కూడా చర్చ సాగుతోంది.