Google fires 28 employees who protested against Israel
contract
గూగుల్ సంస్థ ఇజ్రాయెల్‌తో కుదుర్చుకున్న
కాంట్రాక్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన 28మంది ఉద్యోగులను తమ కంపెనీ నుంచి
తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ రంగాల్లో సేవలు
అందించడానికి గూగుల్, అమెజాన్ సంస్థలు సంయుక్తంగా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో 120 కోట్ల
డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాన్ని నిరసిస్తూ
గూగుల్ సంస్థకు చెందిన న్యూయార్క్, సన్నీవేల్, కాలిఫోర్నియా కార్యాలయాల్లోని పలువురు
ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
పాలస్తీనా అనుకూలురైన ఆ ఉద్యోగులు అరబ్బీ తరహా
సంప్రదాయ హెడ్‌స్కార్ఫ్‌లు ధరించి కార్యాలయాల్లోకి చొరబడ్డారు. కాలిఫోర్నియా
కార్యాలయంలోనైతే ఒక ఉన్నతాధికారి కార్యాలయాన్ని ఆక్రమించారు. ఏప్రిల్ 16న వారు తమ
నిరసన వ్యక్తం చేసారు. ఆ మరునాడు, అంటే ఏప్రిల్ 17 బుధవారం నాడు సంస్థ అంతర్గత
దర్యాప్తు చేపట్టి, ఆ నిరసనకారులను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ విషయాన్ని గూగుల్
గ్లోబల్ సెక్యూరిటీ ఉపాధ్యక్షుడు క్రిస్ రాకో ఒక అంతర్గత మెమో ద్వారా
వెల్లడించారు.
న్యూయార్క్ కార్యాలయంలో నిరసనకారులు మన్హాటన్లో
10వ అంతస్తులో ఉన్న తమ కార్యాలయంలోకి చొరబడ్డారు. అలాగే సియాటెల్‌లోని సంస్థ
కార్యాలయంలోనూ ఆందోళనలు చేపట్టారు.
క్రిస్ రాకో జారీ చేసిన మెమోలో ‘‘వాళ్ళు
కార్యాలయాలను స్వాధీనం చేసుకున్నారు, సంస్థ ఆస్తులు నాశనం చేసారు, సహోద్యోగుల పనికి
విఘాతం కలిగించారు. వారి ప్రవర్తన అంగీకారయోగ్యం కాదు. వారి తోటి ఉద్యోగులను
బెదిరించినట్లుగా ఉంది’’ అని పేర్కొన్నారు.
‘‘గూగుల్ పని ప్రదేశాల్లో ఎక్కడైనా అలాంటి
ప్రవర్తనకు తావు లేదు. దాన్ని మేం ఎంతమాత్రం సహించబోము. సంస్థ ఉద్యోగులు కట్టుబడి
ఉండాల్సిన పలు విధానాలను వారు ఉల్లంఘించారు. ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి, వేధింపులు-వివక్ష-ప్రతీకారాలకు
సంబంధించిన విధానం, ప్రవర్తనా ప్రమాణాలు
అన్నింటినీ అతిక్రమించారు’’ అని వివరించారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం విషయంలో గూగుల్
స్పందించిన తీరును వ్యతిరేకిస్తున్న కొంతమంది ఉద్యోగులు ఆ ఆందోళనలు చేపట్టారు.
న్యూయార్క్, కాలిఫోర్నియాల్లో ఆందోళనకారులు దాదాపు పది గంటల పాటు నిరసన ప్రదర్శన
నిర్వహించారు. తమ ఆందోళనను లైవ్‌స్ట్రీమింగ్ కూడా చేసారు. ఆందోళనకారుల్లో 9మందిని
ట్రెస్పాస్ ఆరోపణలపై స్థానిక పోలీసులు అరెస్ట్ చేసారు.
గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థలు
సంయుక్తంగా ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 120 కోట్ల డాలర్ల విలువైన
ఆ ప్రాజెక్టు పేరు ‘ప్రాజెక్ట్ నింబస్’. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, సైన్యానికీ
క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సేవలు అందించడం ఆ ప్రాజెక్టు లక్ష్యం.
ఇజ్రాయెల్ ఆ టెక్నాలజీలను గాజాలోని పాలస్తీనీయులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందన్నది
నిరసనకారుల అనుమానం. అందుకే ఏకంగా తమ సంస్థకే వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు