సార్వత్రిక ఎన్నికల ఘట్టంలో మొదటి దశ పోలింగ్ మొదలైంది.102 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. 21 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు హక్కు పొందిన యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌నకు తరలి రావాలని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి ఓటుకు మాత్రమే ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధ భారత్‌ను సృష్టించేందుకు ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మెరుగైన పాలన అందించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలని అమిత్ షా యువతను కోరారు.
సార్వత్రిక ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. నేడు జరుగుతోన్న పోలింగ్‌లో 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. వీరిలో 35 లక్షల మంది మొదటిసారి ఓటు పొందినవారు కావడం గమనార్హం. 20 నుంచి 29 మధ్య వయసు వారు 3.51 కోట్ల మంది నేడు పోలింగ్‌లో పొల్గోనున్నారు. దేశ వ్యాప్తంగా 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు మొదటి దశలోనే పోలింగ్ జరుగుతోంది.