భద్రాచలంలో
శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేద
మంత్రోచ్ఛరణల మధ్య శ్రీరామచంద్రుడు సింహాసనాన్ని అధిష్టించారు. సీతమ్మ సమేతంగా
సుగుణాభిరాముడు రాజాధిరాజుగా దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు.
శ్రీ సీతారామచంద్రస్వామి
మహా పట్టాభిషేక మహోత్సవానికి తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో
ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకుని స్వామివారికి
పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీ సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమన్న
రాధాకృష్ణన్, ప్రజలకు సుభిక్షమైన పాలన
అందించడమే రామరాజ్య స్థాపన ఉద్దేశమన్నారు.
భద్రాద్రి
శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం బుధవారం నేత్రపర్వంగా జరిగింది. శ్రీరాముడు పెళ్ళి కుమారుడిగా, సీతమ్మ పెళ్ళి కుమార్తెగా దర్శనమివ్వగా భక్తులు తరించారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కళ్యాణ
క్రతువు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగింది.
సీతమ్మ వారికి కళ్యాణం రోజున దేశంలో ఎక్కడైనా పుస్తెల తాడులో రెండు సూత్రాలను
మాత్రమే ధరింపచేస్తారు. భద్రాచలంలో మాత్రం పుస్తెల తాడులో మూడు సూత్రాలు ఉంటాయి. జనక , దశరథ మహారాజులు
చేయించిన పుస్తెలతో పాటు రామదాసు సీతమ్మను కుమార్తెగా భావించి చేయించిన మూడో
సూత్రాన్ని కలిపి మాంగళ్యధారణ చేస్తారు.