బిట్కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్
కేసులో నటి శిల్పాశెట్టి దంపతులపై ఈడీ చర్యలు
చేపట్టింది. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు చెందిన రూ.97.79కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ముంబైలోనే
సంపన్నప్రాంతంగా పేరున్న జుహూలోని ఓ నివాస
ఫ్లాట్‌ను కూడా అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాటు శిల్పా శెట్టి పేరు మీద ఉంది.
పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ
షేర్లను కూడా అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది.
ముంబైకి చెందిన వేరియబుల్ ప్రైవేట్
లిమిటెడ్ సంస్థ 2017లో ‘గెయిన్ బిట్‌కాయిన్ పోంజీ స్కీమ్’ను
నిర్వహించింది. బిట్కాయిన్లలో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ప్రజలకు ఆశచూపింది. మల్టీ-లెవల్
మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, దిల్లీ లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. దీంతో సంస్థ తో పాటు దాని
ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది.
స్కామ్ లో మాస్టర్‌మైండ్‌గా
వ్యవహరించిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్‌కుంద్రా 285 బిట్కాయిన్లు తీసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో
తేలింది. ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటుకు రాజ్‌కుంద్రా
ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ రాజ్ కుంద్రా వద్ద బిట్ కాయిన్లు
ఉన్నాయని ,
ప్రస్తుత మార్కెట్ ప్రకారం వాటి విలువ
రూ.150 కోట్లకు పైనే ఉంటుందని ఈడీ చెబుతోంది. ఈ
విచారణలో భాగంగానే రాజ్‌కుంద్రా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.