Lok Sabha Elections to start from tomorrow, first phase polling for 102 MP seats
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన
మనదేశంలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 18వ లోక్‌సభ ఎన్నికలకు తొలిదశ
పోలింగ్ రేపు శుక్రవారం జరగనుంది.
మొదటి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత
ప్రాంతాల్లో ఎంపీల ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలోని 102 లోక్‌సభ
నియోజకవర్గాల పరిధిలో ప్రచారానికి నిన్న బుధవారం సాయంత్రంతో తెరపడింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 2 లోక్‌సభ స్థానాలు,
అస్సాంలో 5 సీట్లు, బిహార్‌లో 4 నియోజకవర్గాలు, ఛత్తీస్‌గఢ్‌లో 1 స్థానం, మధ్యప్రదేశ్‌లో
6 సీట్లు, మహారాష్ట్రలో 5 నియోజకవర్గాలు, మణిపూర్‌లోని మొత్తం 2 స్థానాలు,
మేఘాలయలోని మొత్తం 2 సీట్లు, మిజోరంలోని ఒకే ఒక్క స్థానం, నాగాలాండ్‌లోని ఒకే ఒక్క
స్థానం, రాజస్థాన్‌లోని 12 నియోజకవర్గాలు, సిక్కింలోని ఏకైక ఎంపీ సీటు, తమిళనాడులోని
మొత్తం 39 స్థానాలు, త్రిపురలో ఒక నియోజకవర్గం, ఉత్తరప్రదేశ్‌లో 8 సీట్లు, ఉత్తరాఖండ్‌లోని
మొత్తం 5 స్థానాలు, పశ్చిమబెంగాల్లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది.
కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే అండమాన్
నికోబార్ దీవుల్లోని ఒకే ఒక ఎంపీ సీటు, జమ్మూకశ్మీర్‌లోని
ఒక స్థానం, లక్షద్వీప్‌లోని ఒకే ఒక స్థానం, పుదుచ్చేరిలోని ఒకే ఒక నియోజకవర్గానికి
రేపు పోలింగ్ జరుగుతుంది.
మొదటి దశ ఎన్నికల్లో ఎనిమిది మంది
కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ గవర్నర్ పోటీ పడుతున్నారు.
రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని
నాగపూర్ నుంచి బరిలో ఉన్నారు. అక్కడ 2014, 2019లో గెలిచిన గడ్కరీ మూడోసారి కూడా
గెలిచి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి వికాస్
థాకరేతో పోటీ పడుతున్నారు.
ఎర్త్ సైన్సెస్ మరియు ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమల
శాఖ మంత్రి కిరెన్ రిజిజు అరుణాచల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయన
ఇప్పటికి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు,
అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ టుకీని ఎదుర్కొంటున్నారు.
ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి
శర్బానంద సోనోవాల్ అస్సాంలోని దిబ్రూగఢ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఆయనపై
ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి మనోజ్ ధనోవర్ పోటీపడుతున్నారు.
పశుసంవర్ధక శాఖ సహాయమంత్రి సంజీవ్ బల్యన్
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నియోజకవర్గం బరిలో ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి
చెందిన హరీంద్ర మాలిక్, బీఎస్పీ అభ్యర్ధి దారాసింగ్ ప్రజాపతిలతో పోటీ
పడుతున్నారు.
జితేంద్రసింగ్ కేంద్ర క్యాబినెట్లో పీఎంఓ సహాయమంత్రిగా
ఉన్నారు. ఆయన జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ నియోజకవర్గం నుంచి మూడోసారి గెలవడానికి
ప్రయత్నిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిగా చౌదరీ లాల్‌సింగ్, డిపిఎపి
అభ్యర్ధిగా జిఎం సరూరీ పోటీ పడుతున్నారు.
కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ రాజస్థాన్‌లోని
ఆల్వార్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న
భూపేంద్ర, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ అభ్యర్ధి లలిత్
యాదవ్‌తో ఆయన పోటీపడుతున్నారు.
న్యాయశాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ రాజస్థాన్‌లోని
బికనేర్ స్థానం నుంచి నిలబడ్డారు. కాంగ్రెస్ నాయకుడు గోవిందరాం మేఘ్వాల్తో పోటీ
పడుతున్నారు.
జితిన్ ప్రసాద మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుతం
ఉత్తరప్రదేశ్‌లో పిడబ్ల్యుడి శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని
పీలీభిత్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్ధిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఎస్పి
అభ్యర్ధి భగవంత్ పోశరణ్ గాంగ్వర్, బిఎస్పి అభ్యర్ధి అనీస్ అహ్మద్ ఖాన్‌లతో
పోటీపడుతున్నారు.
శివగంగ ఎంపి కార్తి చిదంబరం మరోసారి అదే
నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ఆ
స్థానం నుంచి ఏడుసార్లు గెలిచారు. ఆయన కొడుకు కార్తి ఇప్పుడు రెండోసారి విజయం కోసం
బిజెపి అభ్యర్ధి దేవనాథన్ యాదవ్‌తోనూ, అన్నాడిఎంకె అభ్యర్ధి జేవియర్ దాస్‌తోనూ
పోటీపడుతున్నారు.
తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కుప్పుస్వామి
అన్నామలై కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ మాజీ ఐపిఎస్ అధికారి తొలిసారి
పోటీచేస్తూ డిఎంకె నేత గణపతి రాజకుమార్, అన్నాడిఎంకె నేత సింగై రామచంద్రన్లతో
పోటీ పడుతున్నారు.
తమిళనాడు గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్
గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ క్రియాశీలక రాజకీయాల్లో తన బలాన్ని
పరీక్షించుకుంటున్నారు. చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు.
మధ్యప్రదేశ్
మాజీముఖ్యమంత్రి కమల్‌నాథ్ తొమ్మిదిసార్లు గెలిచిన ఛింద్వారా లోక్‌సభ స్థానం నుంచి
ఆయన కొడుకు నకుల్‌నాథ్ మరోసారి ఎన్నికవడానికి ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో
రాష్ట్రంలోని మొత్తం 29 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ 28 సీట్లు గెలుచుకుంది కానీ
ఛింద్వారాలో మాత్రం ఓడిపోయింది. అలాంటి స్థానం నుంచి నకుల్‌నాథ్ మళ్ళీ పోటీ చేస్తున్నారు.