Campaign concludes in Tamil Nadu, Polling on 19 April
లోక్‌సభ ఎన్నికల్లో
మొదటి దశ పోలింగ్ ఎల్లుండి శుక్రవారం జరగనుంది. ఆ దశలో, మొత్తం 21 రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. అయితే అన్నిటికన్నా
ఎక్కువగా, రాష్ట్రంలోని అన్ని ఎంపీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరుగుతున్న ఒకేఒక రాష్ట్రం
తమిళనాడు. నేటితో తమిళనాడు సహా మొదటి విడత పోలింగ్ జరిగే అన్ని నియోజకవర్గాల
పరిధిలోనూ ప్రచారపర్వానికి తెర పడుతోంది.
ఆఖరి రోజు ప్రచారంలో
భాగంగా ఇవాళ బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు, కోయంబత్తూరు స్థానంలో ఆ పార్టీ అభ్యర్ధి
కుప్పుస్వామి అన్నామలై తన నియోజకవర్గంలో
రోడ్‌షో నిర్వహించారు.
కోయంబత్తూరులో
త్రిముఖపోటీ ఉంది. డిఎంకె, అన్నాడిఎంకె, బిజెపి తమ కూటముల తరఫున తమ పార్టీ అభ్యర్ధులనే
నిలబెట్టడం విశేషం. డిఎంకె తరఫున గణపతి పి రాజకుమార్, అన్నాడిఎంకె తరఫున సింగై
రామచంద్రన్ బరిలో ఉన్నారు.
అన్నామలై కోయంబత్తూరు
నియోజకవర్గానికి తన మ్యానిఫెస్టో విడుదల చేసారు. నగరంలో మేనేజ్‌మెంట్ విద్యా కేంద్రం
ఐఐఎం, జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ కార్యాలయం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్‌సిబి
కార్యాలయం ఏర్పాటు చేయిస్తానన్నది ఆయన ప్రధాన హామీ.
తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి,
కొద్దివారాల క్రితం రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ దక్షిణ చెన్నై నియోజక వర్గం
నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.
ఈసారి తమిళనాడులో కనీసం
10 సీట్లలోనైనా గెలుస్తామని బిజెపి అధ్యక్షుడు అన్నామలై ధీమాగా ఉన్నారు. ఆ
రాష్ట్రంలో మొత్తం 39 ఎంపీ స్థానాలున్నాయి. అన్నింటికీ ఒక్కసారే ఎన్నిక జరగనుంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకె మొత్తం 38 స్థానాలు గెలుచుకుంది. అదే విజయపరంపరను
కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది.