శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో బాలరాముడి
నుదుటన సూర్య కిరణాలు తిలకంగా ప్రసరించాయి. మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58
మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలక్ రాముడి నుదుటిని తాకాయి. ఈ అద్భుత
దృశ్యాన్ని ప్రజలు లైవ్ ద్వారా వీక్షించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా
దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం
ఈ అపురూప దృశ్యాన్ని లైవ్ ద్వారా వీక్షించారు. ఈ అద్భుత క్షణాన్ని చూసే అవకాశం
తనకి లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నని ట్వీట్ చేశారు.
అంతకుముందు సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు ప్రధాని
మోదీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడి కృప కారణంగానే లక్షలాది మందితో కలిసి అయోధ్య లో బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ చూడగలిగానని పేర్కొన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి
రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందన్నారు. మర్యాద పురుషోత్తముడి
జీవితం, ఆశయాలు
అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారాలవుతాయన్నారు.