అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. శ్రీరామనవమి వేడుకలను పురష్కరించుకుని బాలరాముడిని తాకిన సూర్యతిలకం వీక్షించి కోట్లాది భక్తులు పరవశించిపోయారు. అధునాతన సాంకేతికతతో గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం దిద్దినట్లు సూర్యకిరణాలు పడే విధంగా శాస్త్రవేత్తలు చేసిన కృషి ఫలించింది. 58 మి.మీ పరిమాణంలో స్వామి వారి నుదిటిపై సూర్యతిలకం కనువిందు చేసింది.
రామాలయంలోని గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్యకిరణాలు తిలకం మాదిరి ప్రసరించేలా శాస్త్రవేత్తలు ప్రత్యేక కటకాలు ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి ఏటా శ్రీరామనవమినాడు సూర్యతిలకం దిద్దనున్నారు. ఆలయంపైన సూర్యకాంతిని గ్రహించే పరికరం ద్వారా, ఓ సన్నని పైపులో నుంచి కాంతిని పంపించి దాన్ని తిలకంగా రాములోరి నుదుడిపై పడేలా చేశారు.
సూర్యతిలక్ ప్రాజెక్టులో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు, కేంద్ర భవన నిర్మాణ సంస్థ ఇంజనీర్ల సహకారంతో ఈ సూర్యతిలక్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఒకసారి ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా ఏటా భూ భ్రమణంలో స్వల్ప మార్పులు, వాతావరణంలో మార్పులు వచ్చినా గేర్ టీత్ మెకానిజం ద్వారా అనుకున్న విధంగా మలుచుకోవచ్చు. దీని ద్వారా ఏటా నవమినాడు రాముని నుదిటిపై సూర్యతిలకం దిద్దే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.